తెలంగాణ, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్ చేసి ఆరు బిట్ కాయిన్స్ డిమాండ్ చేసిన హ్యాకర్లు :ప్రెస్‌రివ్యూ

తెలంగాణ విద్యుత్ సైట్
ప్రచురణ

ఇరవై నాలుగు గంటల్లో రూ. 24 లక్షలు (ఆరు బిట్‌ కాయిన్‌లు) ఇవ్వాలంటూ సైబర్‌ నేరగాళ్లు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల వెబ్‌సైట్‌ నిర్వాహకులను డిమాండ్‌ చేశారని ఈనాడు వెల్లడించింది.

మింట్‌ కాంపౌండ్‌లోని ఐటీ విభాగం కార్యాలయానికి గురువారం వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు ఈ విషయాన్ని విద్యుత్‌ సంస్థ ఉన్నతాధికారులకు వివరించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్పీడీసీఎల్‌తో సహా ఆంధ్రప్రదేశ్‌లోని రెండు డిస్కంల వెబ్‌సైట్లను హ్యాకర్లు రాన్సమ్‌వేర్‌ జొప్పించి పనిచేయకుండా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నాలుగు డిస్కం వెబ్‌సైట్లను టీసీఎస్‌ నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం డిస్కం వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడి చేశారు. వెబ్‌సైట్‌ తెరపై ''డిపాజిట్‌ సిక్స్‌ బిట్‌ కాయిన్స్‌ అదర్‌వైజ్‌ వియ్‌ డెస్ట్రాయ్‌ ఆల్‌ యువర్‌ డేటా'' అన్న సందేశాన్ని గుర్తించారు. అంతర్జాలం ద్వారా కార్యకలాపాలను ప్రారంభించగా వెబ్‌సైట్‌ పనిచేయలేదు. దీంతో ఐటీ విభాగం అధికారులు మంగళవారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

విద్యుత్‌ సంస్థ వెబ్‌సైట్లు ఎలా హ్యాక్‌ అయ్యాయన్న అంశంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాన్సమ్‌ వేర్‌ వైరస్‌ను ఎలా పంపించారని పరిశోధించేందుకు ఇద్దరు పోలీస్‌ అధికారులు మింట్‌ కాంపౌండ్‌లోని ఐటీ విభాగంలో సర్వర్లను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారు లేదా ఉద్యోగుల్లో ఎవరైనా సర్వర్ల ద్వారా అంతర్జాల(ఇంటర్నెట్‌) కార్యకలాపాలు నిర్వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

విద్యుత్‌ పంపిణీ సంస్థల వెబ్‌సైట్‌ సర్వర్లు హ్యాక్‌ కాకుండా టీసీఎస్‌ సంస్థ 'ఫైర్‌వాల్స్‌'ను ఏర్పాటు చేసింది. ఫైర్‌వాల్స్‌ను ధ్వంసం చేసి హ్యాకర్లు ఒక వెబ్‌సైట్‌లో రాన్సమ్‌వేర్‌ వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఆ వెబ్‌సైట్‌కు తాళం వేసి ఆరు బిట్‌ కాయిన్లను డిమాండ్‌ చేశారు.

ఈ అంశాలను గుర్తించిన అనంతరం పునరుద్ధరణ ప్రక్రియపై విద్యుత్‌ సంస్థ అధికారులు, టీసీఎస్‌ సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. వైబ్‌సైట్‌ను రక్షించేందుకు వీలుగా మరిన్ని ఫైర్‌వాల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీసీఎస్‌ సంస్థ ముంబయి, బెంగళూరు, చెన్నైల నుంచి ఐటీ నిపుణులను నగరానికి రప్పించి డేటాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని పునరుద్ధరించేందుకు మరోరోజు పట్టే అవకాశం ఉందని డిస్కం అధికారులు అంటున్నారని ఈనాడు తెలిపింది.

చంద్రబాబు నాయుడు

‘మితిమీరిన ఈసీ జోక్యం’

కష్ట సమయంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించకుండా ఎన్నికల నియమావళి పేరుతో మౌనంగా ఉండిపోతే ఎలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇలాగైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అర్థమే ఉండదన్నారు. అవసరమైతే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు వెళతాను అని స్పష్టం చేశారు. గురువారం ఫణి తుఫానుపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల నియమావళిని సడలించాలని భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ఇంత వరకు స్పందనలేదు. విపత్తుల వంటి అత్యవసర సందర్భాల్లోనైనా వారు స్పందించాలి. ఎన్నికల నియమావళి పేరుతో వ్యవస్థల మధ్య ఘర్షణ వైఖరి తగదన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నాను'' అని తెలిపారు.

విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు జారీ చేయాల్సిన అవసరంలేదుని... మళ్లీ వాటి కోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. ఈసీ ఇప్పటికే మితిమీరిన జోక్యం చేసుకుంటోందని విమర్శించారు.

అధికారుల్లో చీలిక తేవాలని విపక్షం కుట్ర చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ''దానికి నేను కారణం కాకూడదనే అన్నీ సహిస్తున్నాను. అసలు అధికారులు ఎవరికి జవాబుదారీగా ఉండాలి. ఎవరి పర్యవేక్షణలో ఉండాలి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికా? లేక ఎన్నికల సంఘానికా?' అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిందని, ఇక ఓటర్లను ప్రభావితం చేసే ప్రశ్న ఎందుకు తలెత్తుతుందని ఈసీని నిలదీశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

కానిస్టేబుల్ శ్రీనివాస్‌
ఫొటో క్యాప్షన్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌

సిటీబస్సులో పేలిన తూటా

ప్రయాణికులతో కిక్కిరిసిన సిటీ బస్సులో ఇద్దరి మధ్య జరిగిన చిన్న వివాదం తుపాకీ కాల్పులకు దారితీసింది. ఫుట్‌బోర్డ్ ప్రయాణం విషయంలో ఇద్దరు మీడియా వ్యక్తులు ఘర్షణకు దిగడంతో.. వారిని బెదిరించేందుకు ఆ వ్యక్తి తన పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరుగలేదు. తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

కలకలం సృష్టించిన ఈ ఘటన గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగింది. ఘటన వివరాలను పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.

కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు (ఏపీ28జెడ్4468) పంజాగుట్ట హిమాలయ బుక్ స్టోర్ వద్ద బస్టాప్‌లో ఆగగానే సఫారీడ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి బస్సు ఎక్కి ఫుట్‌బోర్డుపై నిల్చున్నాడు. తాము దిగే స్టేజి వచ్చినందున పైకిరావాలంటూ వేర్వేరు వార్తాచానళ్లలో పనిచేసే ఇద్దరు.. సఫారీడ్రెస్ వ్యక్తికి సూచించారు. ఆ వ్యక్తి పట్టించుకోకపోవడంతో పైనున్నవారు గద్దించినట్టుగా మాట్లాడారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం కొనసాగింది. రెచ్చిపోయిన సఫారీవాలా జేబులో నుంచి పిస్టల్ తీసి మీడియా సిబ్బందిని బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకీ పేలడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

ఏమి జరిగిందో తెలియని డైవర్ బస్సును ఆపడంతో సఫారీవాలా బస్సుదిగి జారుకున్నాడు. కాల్పుల విషయాన్ని డిపో అధికారులకు చేరవేసి, వారి సూచన మేరకు డ్రైవర్ యాకూబ్, కండక్టర్ భూపతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇదిలాఉండగా, పిస్టల్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ కోసం పంజాగుట్ట పోలీసులు చాలా సేపు వెతికినప్పటికీ దొరుకలేదని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్.. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. పంజాగుట్టలోని ఆంధ్ర బ్యాంకులో డబ్బు డ్రాచేసుకొని మణికొండ వైపు వెళ్తున్న 47ఎల్ బస్సు ఎక్కాడు. కాల్పులు జరిపిన అనంతరం నాగార్జున సర్కిల్ వద్ద దిగి కూకట్‌పల్లిలోని ఇంటికి వెళ్లిపోయాడు.

ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా.. సఫారీడ్రెస్‌లో ఉన్న వ్యక్తి హడావుడిగా వెళ్తున్న దృశ్యాలు కన్పించాయి. అతడి గురించి ఆరాతీసి కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. అదుపులోకి తీసుకొన్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందించారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

విద్యార్థులు

ఉన్నత విద్య పరీక్షల్లో సంస్కరణలు

రాష్ట్రంలో ఉన్నతవిద్య పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో పొరపాట్ల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అప్రమత్తమైందని సాక్షి తెలిపింది.

డిగ్రీ, పీజీ, ఇతర వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్‌ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు దొర్లకుండా చూడటంతోపాటు ఫలితాల్లో పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీ చర్యలు చేట్టాలని నిర్ణయించింది. అలాగే ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌)ను పక్కాగా అమలు చేయడంతోపాటు డిగ్రీ కోర్సుల్లో ఒకే రకమైన గ్రేడింగ్‌ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది.

పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్‌ విధానం అమలు చేయడంతోపాటు పరీక్షల మూల్యాంకన కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించాలని యూనివర్సిటీల వీసీలకు స్పష్టం చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, వ్యాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై యూనివర్సిటీలు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పేర్కొంది. వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే సంబంధిత లెక్చరర్లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా నిబంధనలను రూపొందించి అమలు చేయాలని పేర్కొంది.

గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వీసీలతో పరీక్షల సంస్కరణలపై సమీక్ష సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసరావు, వీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను పాపిరెడ్డి విలేకరులకు తెలియజేశారు. ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో తప్పిదాల ఘటన తర్వాత యూనివర్సిటీల్లో పరీక్షల విధానంపై సమీక్షించినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు పలు సంస్కరణలు తేవడంతోపాటు భవిష్యత్తులో మరింత పక్కాగా ఉండేందుకు కార్యాచరణపై నివేదిక అందజేసేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)