ఐపీఎల్ 2019: ఉత్కంఠభరిత పోరులో విజయంతో ప్లేఆఫ్ చేరిన ముంబయి ఇండియన్స్‌

హార్దిక్ పాండ్యా
ఫొటో క్యాప్షన్, హార్దిక్ పాండ్యా
    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి 16 పాయింట్లతో ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్‌లో స్థానం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ కేపిటల్స్ జట్ల తర్వాత ప్లే ఆఫ్ చేరిన మూడో జట్టు ముంబయి. ప్లే ఆఫ్‌కు చేరడానికి ముంబయి ఇండియన్స్ జట్టు వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుతో హోరాహోరీ తలపడింది. చివరి వరకూ తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్... టై అయింది. దీంతో ఫలితం తేల్చేందుకు వేసిన సూపర్ ఓవర్‌ ద్వారా ముంబయి విజయం సాధించింది.

సూపర్ ఓవర్‌లో 9 పరుగులు సాధించాల్సిన తరుణంలో రషీద్ ఖాన్ వేసిన తొలిబంతినే ముంబయి జట్టు ఆటగాడు హార్దిక్ పాండ్యా సిక్స్‌గా మలిచి తర్వాత బంతికి సింగిల్‌తో కలిపి 7 పరుగులు చేయగా, కీరన్ పొలార్డ్ రెండు పరుగులు చేసి జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చారు.

మొదటి సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ జట్టు మొహమ్మద్ నబీ ఓ సిక్స్ కొట్టడంతో మొత్తం 8 పరుగులు చేసింది.

ముంబయి ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా తన సూపర్ ఓవర్ మొదటి బంతికే మనీష్ పాండేను రనౌట్ చెయ్యడం ద్వారా జట్టు విజయానికి అవసరమైన పునాది వేశాడు. మనీష్ పాండే సూపర్ ఓవర్‌లో విఫలమైనప్పటికీ ఛేదనలో కీలక పాత్ర పోషించాడు.

క్వింటన్ డికాక్
ఫొటో క్యాప్షన్, క్వింటన్ డికాక్

టై-అప్‌కు దారితీసింది ఇలా...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగుల స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది.

హైదరాబాద్ జట్టులో మనీష్ పాండే 47 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సులతో 71 పరుగులు చేసి అజేయంగా నిలవగా, మొహమ్మద్ నబీ 31 పరుగులు చేశాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 24, సూర్యకుమార్ యాదవ్ 23 పరుగులు చేయగా, ఓపెనర్ క్వింటన్ డికాక్ ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో ఓ సిక్స్, ఓ ఫోర్‌తో కలిపి మొత్తం 18 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

మనీష్ పాండే
ఫొటో క్యాప్షన్, మనీష్ పాండే

పాండ్యా పవర్

163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 14.3 ఓవర్లలో 105 పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయింది. అప్పటి వరకూ చప్పగా సాగిన మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. కానీ మనీష్ పాండే, నబీ రూపంలో మైదానంలో పరుగుల తుపాను మొదలైంది. వీరిద్దరూ కలసి 20 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులతో 31 పరుగులు చేశారు.

విజయం సాధించడానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో హార్దిక్ పాండ్య బౌలింగ్‌కు వచ్చాడు. తొలి రెండు బంతుల్లో రెండే పరుగులు చేశాడ్ మనీష్ పాండే. మూడో బంతికి నబీ సిక్స్ కొట్టినా తర్వాత బంతికే సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. తర్వాత బంతికి మనీష్ రెండు పరుగులు చేశాడు. ఆఖరి బంతికి ఏడు పరుగులు చేయాల్సి ఉండగా మనీష్ పాండే నేరుగా ఓ సిక్స్ బాదాడు. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 25 పరుగులు చేశాడు.

మొహమ్మద్ నబీ
ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ నబీ

ఉత్కంఠభరిత పోరు

ముంబయి ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాలు తలో రెండు వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుండటంతో స్టేడియంలోని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ టెన్షన్‌తో తరచూ కళ్లు మూసుకోవడం టీవీ స్క్రీన్‌లపై కనపడింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత సూపర్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్ రోహిత్ శర్మ పొగడ్తల్లో ముంచెత్తాడు. స్కోరు బోర్డుపై మంచి స్కోరు ఉంచితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచొచ్చనే ఉద్దేశంతోనే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ చెప్పాడు.

హార్దిక్ పాండ్యా
ఫొటో క్యాప్షన్, హార్దిక్ పాండ్యా

స్కోర్లు

ముంబయి ఇండియన్స్ - మొత్తం స్కోరు: 162/5

  • రోహిత్ శర్మ - 24
  • క్వింటన్ డికాక్ - 69*
  • సూర్యకుమార్ యాదవ్ - 23
  • ఎవిన్ లూయిస్ - 1
  • హార్దిక్ పాండ్యా - 18
  • కీరన్ పొలార్డ్ - 10
  • కృనాల్ పాండ్యా - 9
  • ఎక్స్‌ట్రాలు - 8

సన్‌రైజర్స్ హైదరాబాద్ - మొత్తం స్కోరు: 162/6

  • వృద్ధిమాన్ సాహ - 25
  • మార్టిన్ గప్తిల్ - 15
  • మనీష్ పాండే - 71*
  • కేన్ విలియమ్‌సన్ - 3
  • విజయ్ శంకర్ - 12
  • అభిషేక్ శర్మ - 2
  • మొహమ్మద్ నబీ - 31
  • రషీద్ ఖాన్ - 0*
  • ఎక్స్‌ట్రాలు - 3
రోహిత్ శర్మ
ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ

మరో ప్లే ఆఫ్ ఎవరిదో?

ముంబయి విజయంతో ఐపీఎల్ 12వ సీజన్‌లో ప్లే ఆఫ్ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. ప్లే ఆఫ్‌కు చేరే నాలుగో టీమ్ ఏదో చెప్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టంగానే కనిపిస్తోంది.

ప్రస్తుతానికైతే మూడో టీమ్‌పై ఉన్న ఉత్కంఠ తొలగిపోయింది. 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించిన చెన్నై జట్టు అగ్రస్థానంలో ఉండగా, కొద్దిగా మెరుగైన రన్‌రేట్ కారణంగా ముంబయి జట్టు రెండో స్థానంలో, దిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించాయి.

ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. శుక్రవారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మొహాలీలో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 10 పాయింట్లతో ప్రస్తుతం సమానంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.