సోనియా గాంధీకి చంద్రబాబు చేసిన మూడు ప్రతిపాదనలు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, fb/tdp.ncbn.official
ఎన్డీయేతర పక్షాలు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు ప్రతిపాదనలు చేశారని ఈనాడు కథనం పేర్కొంది.
ఆదివారం సాయంత్రం సోనియాగాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. తొలిసారి 10-జన్‌పథ్‌కు వెళ్లిన ఆయన సుమారు 40 నిమిషాలపాటు ఆమెతో జాతీయ రాజకీయాల గురించి చర్చించారు.
అంతకుముందు ఆయన రాహుల్ గాంధీ, శరద్ పవార్‌లతో సమావేశమై ఎస్పీ, బీఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, మాయావతిలతో శనివారం జరిపిన చర్చల వివరాలను వెల్లడించారు.
ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపైనే సోనియాతో చంద్రబాబు ప్రధానంగా చర్చించారు.
ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో సంబంధం లేకుండా రాజకీయ సమాలోచనలు జరపాలన్న ఉద్దేశంతోనే ఆమెతో భేటీ అయ్యారు.
23వ తేదీన వెలువడే ఫలితాల్లో ఎన్డీయేతర పక్షాలకు వచ్చే సంఖ్యాబలం ఆధారంగా వ్యూహాత్మకంగా ముందడుగు వేయడానికి చొరవ తీసుకోవాలని ఆయన సోనియాకు సూచించినట్లు సమాచారం.
ఆమె ముందు మూడు మార్గాలను సూచించినట్లు సమాచారం. ఎన్డీయేతర పక్షాలన్నీ ఒక్కటిగా ఉన్నాయన్న సందేశాన్ని బలంగా వినిపించాలని, ఒకవేళ విపక్షాలకు ప్రభుత్వం ఏర్పాటుచేయదగ్గ సంఖ్య వచ్చేట్లయితే తామంతా ఒక్కటే, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించేలా రాష్ట్రపతికి లేఖ ఇవ్వడానికి ప్రయత్నించాలని, ఇప్పటివరకూ ఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్న పార్టీలను భాజపా వ్యతిరేక కూటమిలోకి వచ్చేలా తగిన ప్రయత్నాలు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ఆమెముందు పెట్టారు.
ఈ అభిప్రాయంతో ఏకీభవించిన సోనియాగాంధీ 23 ఫలితాల తర్వాత దీనిపై తదుపరి కార్యాచరణ చేపడతామని అన్నట్లు తెలిసింది. అయితే, అంతవరకూ వేచిచూడకుండా ముందుగానే వేగంగా స్పందించాలని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే ఇప్పటివరకూ జరిగిన చర్చలన్నీ విభిన్నపార్టీలు, వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం వరకే పరిమితం అవుతోంది తప్పితే అంతకుమించి ఏమీ జరగలేదని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పుడిప్పుడే నేతలు మనసులోని మాటను బయటపెడుతున్నారని, వాటన్నింటినీ క్రోడీకరించి దాని ఆధారంగా ప్రధానమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాయి.
సోమవారం సాయంత్రం మాయావతి, మమతా బెనర్జీల్లో ఒకరు దిల్లీకి వచ్చే అవకాశం ఉందని, వారితో సమావేశం కావడానికి చంద్రబాబునాయుడు మళ్లీ దిల్లీకొస్తారని తెదేపా వర్గాలు చెప్పాయని ఈనాడు రాసింది.

ఫొటో సోర్స్, fb/hdkumaraswamy
మీడియా నన్ను వేధిస్తోంది
ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తనను మీడియా మానసికంగా వేధిస్తోందని కర్నాటక సీఎం కుమారస్వామి అన్నారని సాక్షి రాసింది.
ఆదివారం ఆయన మైసూరులో మాట్లాడుతూ... మా నాయకులను ఇష్టం వచ్చినట్లు చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. మేము ఏమైనా కమెడియన్లమా? మమ్మల్ని కామెడీ అంశాలుగా చూపించే అధికారం మీకు ఎవరిచ్చారు? మమ్మల్ని ఏమనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.
"మీడియాతో సన్నిహితంగా మెలిగే నేతను నేను. ఇదే అదనుగా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తారా? టీవీ ఛానెళ్లను సరైన విధంగా నడిపించడం చేతకాకపోతే మూసేసుకోండి. ఇకపై మీడియాతో మాట్లాడను, మీడియాను బహిష్కరిస్తున్నా" అని కుమారస్వామి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రక్తం దానం చేసేందుకు పుణె నుంచి విశాఖకు
విశాఖలో అత్యవసర స్థితిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి రక్తదానం చేసేందుకు పుణె నుంచి ఓ వ్యక్తి సొంతఖర్చులతో విమానంలో వచ్చారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
విశాఖ నగరానికి చెందిన సంగీత(35) కొద్దిరోజులుగా రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈమెది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో దాత కోసం పలుచోట్ల ప్రయత్నించారు. ఆఖరికి లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ సుమనను సంప్రదించారు.
వారి చొరవతో చివరకు పుణెకు చెందిన గణేష్ లోకండే(35) ముందుకు వచ్చారు. గణేష్ లోకండేది కూడా ప్రపంచంలోనే అత్యంత అరుదైన 'బాంబే బ్లడ్ గ్రూప్'.
ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు పది లక్షల్లో ముగ్గురు మాత్రమే ఉండడంతో దీనికి అత్యంత డిమాండ్ ఉంది.
వృత్తిరీత్యా వ్యాపారి అయిన గణేష్ లోకండే... అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతోమందికి రకాన్ని ఇచ్చి ప్రాణాలను కాపాడారు. కాగా, గణేష్ తోపాటు ఆయన కుమార్తె, సోదరిది కూడా బాంబే బ్లడ్ గ్రూప్ కావడం విశేషం.
ఇప్పటి వరకు 30 సార్లు దేశంలోని అనేక ప్రాంతాలకు చెందినవారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేశానని గణేష్ తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే భవిష్యత్తులో మనల్ని మరొకరు ఆదుకుంటారన్న నమ్మకంతోనే అలా చేస్తున్నానని ఆయన చెప్పారు.

హైదరాబాద్ మెట్రో ప్రపంచ రికార్డు
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఒకే ప్రాజెక్టులో అత్యధిక పిల్లర్లు నిర్మించిన ఏకైక సంస్థగా ఎల్‌అండ్‌టీ ప్రపంచ రికార్డు సాధించిందని నమస్తే తెలంగాణ కథనం తెలిపింది.
ప్రపంచంలో ఇప్పటివరకు ఒకే ప్రాజెక్టులో ఒక సంస్థ 2,599 పిల్లర్లను నిర్మించిన చరిత్ర లేదని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
ఎంజీబీఎస్ సమీపంలో నిర్మించిన చివరి పిల్లర్‌తో మొదటిదశ ప్రాజెక్టులోని 66 కిలోమీటర్ల మార్గానికి 2,599 పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు.
ఇప్పటికే 56 కిలోమీటర్ల మార్గం ప్రయాణానికి అందుబాటులోకి రాగా, మరో 10 కిలోమీటర్ల మార్గం జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్) నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) వరకు ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించేందుకు సిద్ధ్దమవుతున్నట్టు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- ‘హైదరాబాద్ మెట్రోలోంచి చూశాక సిటీపై ఇష్టం చాలా పెరిగింది’
- ‘హైదరాబాద్ మెట్రో‘ లిఫ్ట్‌లో దృశ్యాలు వైరల్: ముద్దూ ముచ్చట అసాంఘికమా
- ఆన్లైన్లో అమ్మాయిలు.. ఈ ఒంటరితనానికి పరిష్కారమేంటి
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- వీధి కుక్క పిల్లను కాపాడి రేబిస్‌తో మహిళ మృతి
- 'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























