తెలంగాణ: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) మరణించినట్లు ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.
‘‘కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు.
ఆయనఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖాలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.
రామలింగారెడ్డి 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
రామలింగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
ఆయన భౌతిక కాయాన్ని కుటుంబీకులు సిద్ధిపేట జిల్లాలోని స్వగ్రామం చిట్టాపూర్‌కు తరలించార’’ని ఆ కథనంలో వెల్లడించారు.

ఫొటో సోర్స్, CHANDRABABU/FB
'అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించండి. మా పదవులు వదిలేస్తాం': చంద్రబాబు
అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారని, ప్రభుత్వం అలా చేస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలందరం శాసనసభ్యత్వాలనూ వదులుకుంటామని ప్రకటించారని పేర్కొంటూ ‘ఈనాడు’ పత్రిక ఓ వార్త రాసింది.
‘ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని పదే పదే మాట్లాడి.. ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో అమరావతిని ఆమోదించారా.. లేదా?’ అని ప్రశ్నించారు.
‘చెప్పింది చేయకపోతే నిలదీయండి, రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పిన మీరు (సీఎం).. మాట తప్పారు. ఇప్పుడు మరి రాజీనామా చేస్తారా? అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా?’ అని నిలదీశారు. ‘మాట తప్పడం ఇంటా వంటా లేదనే ఆయన.. ఎన్నికలంటే పారిపోయారు’ అని ఎద్దేవా చేశారు.
వైకాపా అధికారంలోకి వస్తే అమరావతిని సర్వనాశనం చేస్తారని.. ఎన్నికలకు ముందే ప్రజలను హెచ్చరించానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘చట్టంలో ఉన్న ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో.. రాష్ట్రపతి ప్రకటన జారీచేయడంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి శంకుస్థాపన చేశారు. అయినా హైకోర్టును మార్చేస్తామనడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు.
‘విశాఖపట్నం వాసులు నీతి, నిజాయతీకి కట్టుబడతారు, ప్రశాంత జీవితం గడపాలనుకుంటారు. హుద్‌హుద్ సమయంలో నేను ఒక్క పిలుపిస్తే.. ముందుకొచ్చారు’ అని ప్రశంసించారు. ‘అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాజధాని అమరావతిలో ఉంటుందని అంతా కలిసి ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట కోసమే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం’ అని చెప్పారు.
‘అయోధ్యలో రామాలయం సమస్యను పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి కూడా దేవతల రాజధాని. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి మట్టిని, యమునా జలాలను తెచ్చి శంకుస్థాపన చేశారు. దేశమంతా అమరావతికి అండగా ఉంటుందని చెప్పారు. అయోధ్య సమస్య లాగే.. ఇక్కడా రైతుల సమస్య పరిష్కరించాలి’ అని చంద్రబాబు కోరారు.

ఫొటో సోర్స్, @TELANGANACMO
‘తెలంగాణలో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు’
తెలంగాణలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది.
ఈ నూతన విధానంలో భాగంగా స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్ చార్జీల్లో ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది.
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందించాలనేది ఈ పాలసీ ఉద్దేశం. అయితే మహారాష్ట్రలో 80 శాతం, ఏపీ, కర్ణాటకలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 70 శాతం మేర స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
ఈ విధానంపై విమర్శ లు వస్తున్న నేపథ్యంలో రెండు కేటగిరీల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ స్కిల్డ్ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీ ప్రైడ్, టీ ఐడియాలలో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇవి అదనం.
స్కిల్డ్ కేటగిరీలో మధ్య తరహా, భారీ పరిశ్రమలకు వ్యాట్/సీఎస్టీ/జీఎస్టీలో 10 శాతం రాయితీ ఇస్తారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి రాయితీలుండవు.
విద్యుత్ ఖర్చు పరిహారానికి సంబంధించి సెమీ స్కిల్డ్ కేటగిరీలో ఐదేళ్ల వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి వంతున ప్రోత్సాహకం ఇస్తారు. మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సెమీ స్కిల్డ్ కేటగిరీలో యూనిట్‌కు 75 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి చొప్పున ఇస్తారు.
సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలో 5 శాతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఒక్కో వ్యక్తికి చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రూ. 3 వేలు, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు రూ.5 వేలకు మించకుండా చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మద్యం ధరలపై పునరాలోచనలో ఏపీ’
లాక్డౌన్ సమయంలో పెంచిన మద్యం ధరలపై ఆంధ్రప్రభుత్వం పునరాలోచన చేస్తోందంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఓ వార్త రాసింది.
ఒక్కసారిగా మద్యం అమ్మకాలు పడిపోవడం, పక్క రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం రావడం, నాటుసారా పెరగడం, ప్రజలు శానిటైజర్లు తాగడం వంటి ఘటనలు ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేశాయని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా మద్యంపై వచ్చే ఆదాయంలోనూ ప్రభుత్వానికి భారీగా కోత పడింది. ప్రభుత్వ అంచనా ప్రకారం నెలకు కనీసం రూ.1,700 కోట్లు అయినా రావాల్సి ఉండగా, పెంచిన ధరలతో సగం ఆదాయం తగ్గిపోయింది.
కరోనాతో అన్ని రకాలుగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి స్థిరంగా వచ్చే మద్యం ఆదాయం కూడా తగ్గిపోవడం ఇబ్బందిగా మారింది. మద్య నిషేధం పేరుతో ధరలు పెంచేస్తే తాగుడు మానేస్తారని భావించగా, అక్రమ మద్యం రావడంతో ప్రజలు అటువైపు మళ్లుతున్నారు.దీంతో పాత విధానమే మేలనే అభిప్రాయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం ఒకేసారి 75 శాతం ధరలు పెంచింది. ఇప్పుడు అందులో 40 శాతం తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఇప్పటికే అధికార వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరుస్తూనే ధరలు తగ్గించడం ఎలా? అనే కోణంలో ఆలోచన చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘ఆ ఆసుపత్రుల నుంచి భూములు ఎందుకు వెనక్కితీసుకోరు’: తెలంగాణ హైకోర్టు
ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ హైకోర్టు మండిపడిందని ‘వెలుగు’ దినపత్రిక వార్త రాసింది.
కరోనా రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుంటే సర్కారు పట్టించుకోకపోతే ఎలా? అని హైకోర్టు ప్రశ్నిం చింది. రాయితీలతో భూముల్ని పొందిన ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి అధికంగా ఫీజులు గుంజుతుంటే ఆ భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదో చెప్పాలని అడిగింది.
పేదలకు ఉచిత వైద్యం అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి భూములు పొందిన జూబ్లీ హిల్స్‌లోని అపోలో హెల్త్‌సిటీ ఆస్పత్రి, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేయడాన్ని తప్పు పడుతూ సోషల్ వర్కర్ ఓ.ఎం. దేబరా దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు బుధవారం విచారించింది.
షరతులను పాటించని ఆస్పత్రులకు రాయితీలపై ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
1981లో అపోలో ఆస్పత్రి (డెక్కన్ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్)కు 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని, 1989లో బసవ తారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 30 ఏళ్లకు లీజుకు ఇస్తూ తిరిగి లీజు పొడిగించే షరతుపై ప్రభుత్వం ఇచ్చిందని పిటిషనర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.
యూఎల్సీ నిబంధనలు అమలు నుంచి మినహాయింపు ఇచ్చి అపోలోకు 30 ఎకరాలను ఇచ్చిన భూముల విలువ రూ.1500 కోట్లకు పైగానే ఉంటుందని, బసవ తారకం ఆస్పత్రికి ఇచ్చిన భూముల విలువ రూ.400 కోట్లుఉంటుందని చెప్పారు.
అపోలోలో 15 శాతం, బసవ తారకంలో 25 శాతం పడకలను పేదలకు ఉచితంగా ఇవ్వాలని, ఔట్ పేషెంట్లకు 40 శాతం ఉచితంగా చికిత్స అందించాలన్నారు. అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, రోజుకు రూ.లక్ష వరకూ వసూలు చేస్తోందని, భూమి తీసుకున్నప్పుడు అంగీకరించిన షరతులు అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో కూడా కనికరం లేకుండా కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులపై కొరడా ఝుళిపించేందుకు ఏమాత్రం వెనకాడకూడదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























