అమ్మాయినే వేధిస్తావా? కేసు నమోదయ్యిందని మెయిల్... నిరుద్యోగికి రూ. 6.96 లక్షల టోకరా-ప్రెస్ రివ్యూ

ముఖం కనిపించని అమ్మాయి
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
ప్రచురణ

అమ్మాయిని వేధించినందుకు జైలు శిక్ష తప్పించుకోవాలంటే సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ కేటుగాళ్లు ఓ నిరుద్యోగి నుంచి రూ. 6.96 లక్షలు కాజేసినట్లు 'ఈనాడు' ఒక కథనం రాసింది.

దాని ప్రకారం.. ''ఐడీఏ జీడిమెట్లకు చెందిన బాధితుడు ఎంఎస్సీ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నాడు.

కొన్ని రోజుల కిందట crpccrime@gmail.com అనే ఐడీ నుంచి మెయిల్ వచ్చింది.

మీరొక అమ్మాయిని వేధించారని, మీపైన 356(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. అమ్మాయితో ఉన్నట్లు బాధితుడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు.

అయితే, తనకు ఆ అమ్మాయి ఎవరో తెలియదంటూ బాధితుడు వాపోయాడు. అయినా సెప్టెంబర్ 10న మ. 12 గంటలకు తల్లిదండ్రులను తీసుకురావల్సి ఉంటుందని హెచ్చరించారు. హాజరు కాకపోతే పోలీసులే వెతుక్కుంటూ వస్తారని బెదిరించారు.

దీంతో ఏం చేయాలో అర్థం కాక మిత్రుని సలహా కోరాడు. వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ చేయగా అవతలి వ్యక్తులు పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోమన్నారు. వాళ్ల బంధువులు ఫోన్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత నలుగురు ఫోన్లు చేశారు.

వాళ్లు అడిగినప్పుడల్లా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 3 మధ్య దఫదఫాలుగా రూ. 6.96 లక్షలు పంపించాడు. కేసు కొట్టేశారా... లేదా? అని తెలుసుకునేందుకు ఫోన్లు చేయగా స్విచ్ఛాప్ అని రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు'' ఈనాడు వెల్లడించింది.

ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్
ఫొటో క్యాప్షన్, ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ (పాత చిత్రం)

ఐసీయూలో మూడు రోజులు... ఇచ్చింది పారాసిటమాల్

'దిశ' ఎన్‌కౌంటర్‌ ఘటనలో గాయపడి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలోని ఐసీయూలో చేరిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్‌లకు పారాసెటమాల్‌తో చికిత్స చేశామని ఆసుపత్రి కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ పి.విశ్వక్‌సేన్‌రెడ్డి చెప్పినట్లు 'సాక్షి' ప్రచురించింది.

''సిర్పుర్కర్‌ కమిషన్‌ గురువారం పి.విశ్వక్‌సేన్‌రెడ్డిని విచారించింది. కమిషన్‌ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్‌ ఆయనను ప్రశ్నించారు.

2019 డిసెంబర్‌ 6న ఉదయం 8 గంటలకు కేర్‌ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్‌సేన్‌రెడ్డి వివరించారు.

కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్‌ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స చేశామని కమిషన్‌కు తెలిపారు.

ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్‌లోనూ నమోదు చేశామని వివరించారు.

గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్‌ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్‌) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్‌లో నమోదు చేశానని సమాధానమిచ్చారు.

అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్‌సేన్‌.. కేర్‌ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు.

ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని ఆయన తెలిపినట్లు'' సాక్షి పేర్కొంది.

రైలు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

రెండున్నర కిలోమీటర్ల గూడ్స్ రైలు

విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఓ సూపర్‌ గూడ్స్ రైలుకు రూపకల్పన చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం రాసింది.

''గూడ్స్‌ రైళ్ల వల్ల ప్రయాణికుల రైళ్లకు ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రైల్వే శాఖ చాలా ప్రయోగాలు చేస్తోంది.

తాజాగా మూడు గూడ్స్‌ రైళ్లను కలిపి ఒకేసారి నడిపే యోచన చేసింది. ఈ ఆలోచనకు అనుగుణంగా, దక్షిణ మధ్య రైల్వే చేసిన సూచనల మేరకు, 174 వ్యాగన్లతో విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ఓ సూపర్‌ రైలుకు రూపకల్పన చేశారు

ట్రైన్‌ ముందు రెండు, మధ్యలో రెండు, చివర్లో రెండు చొప్పున మొత్తం ఆరు ఇంజిన్లు ఏర్పాటు చేశారు. దీనిని గురువారం విజయవాడ నుంచి దువ్వాడకు ప్రయోగాత్మకంగా ఖాళీ రేకులతో నడిపారు.

2.40 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ భారీ గూడ్స్‌ రైలు 50 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఈ రైలుకు 'త్రిశూల్‌' అని నామకరణం చేశారు. 'త్రిశూల్‌' గూడ్స్‌ రైలు నిర్వహణలో కృషి చేసిన విజయవాడ డివిజన్‌ అధికారులను రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించినట్లు'' సాక్షి తెలిపింది.

పెట్రోల్

లీటర్‌కు 30 ఎంఎల్ తక్కువ పెట్రోల్ వచ్చేలా....

పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్‌ అమర్చి..మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ఎస్‌వోటీ, బాలానగర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం రాసింది.

''పెట్రోల్‌ యంత్రంలో చూపించే రీడింగ్‌ పాయింట్స్‌ ఒక్కొక్కటిగా జంప్‌ అవుతూ.. చివరకు తక్కువగా ఇంధనం పోసే.. సాప్ట్‌వేర్‌ను రూపొందించిన ఈ గ్యాంగ్‌.. ఏకంగా బంక్‌ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకొని.. దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది.

సైబరాబాద్‌ పరిధిలోని బాలానగర్‌ జోన్‌ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం…జగద్గిరిగుట్టకు చెందిన ఎండీ ఫయాజుల్‌(46), అల్వాల్‌కు చెందిన కురడె సందీప్‌(38), బండ్లగూడకు చెందిన ఎండీ అస్లాం(29),యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజ్‌పల్లి గ్రామానికి చెందిన కలిమెర నర్సింగరావు(32) గతంలో పెట్రోల్‌ బంక్‌లో పనిచేసి మానేశారు.

ముఠాగా ఏర్పడి.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు ప్లాన్‌ వేశారు. రాజస్థాన్‌లోని సూరజ్‌ అనే వ్యక్తి రూపొందించిన ఓ సాప్ట్‌వేర్‌ చిప్‌ను తీసుకొని.. మరింత అభివృద్ధి చేశారు.

బంక్‌ల నిర్వాహకులకు ఎరగా వేశారు. యంత్రాన్ని ట్యాంపరింగ్‌ చేసి అందులో మైక్రో చిప్‌ పెట్టి మోసం చేస్తున్నారు. లీటర్‌కు 30 ఎంఎల్‌, 50 ఎంఎల్‌ వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేశారు.

ఈ చిప్‌ను రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు బంక్‌ డీలర్లకు అమ్మకాలు చేశారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలోని ఇప్పటికే 34 బంక్‌లలో మైక్రో చిప్‌లను అమర్చారు. ఇలా వచ్చిన డబ్బులను ఒప్పందం ప్రకారం పంచుకుంటారు.

విశ్వసనీయ సమాచారం మేరకు లీగల్‌ మెట్రాలజీ అధికారులతో పాటు సైబరాబాద్‌ ఎస్‌వోటీ డీసీపీ సందీప్‌, ఎస్‌వోటీ బాలానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జేమ్స్‌బాబు, జీడిమెట్ల, మేడ్చల్‌ పోలీసులు రంగంలోకి దిగి ఈ నలుగురు నిందితులను పట్టుకున్నట్లు'' నమస్తే తెలంగాణ కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)