తీరం దాటిన అర్నబ్ తుపాన్.. ఏపీలో భారీ వర్షాలు

తీరం దాటిన తుపాను
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను కారణంగా శ్రీకాకుళం బస్టాండ్‌లోకి భారీగా నీరు చేరింది.
    • రచయిత, గరికపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తీవ్ర తుపాను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున తీరం దాటింది.

రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య యానానికి నైరుతిగా(నరసాపురం వైపు) తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

తీరం దాటిన తర్వాతే తీవ్ర తుపానుగా బలహీనపడిన అర్నబ్ ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తల కారణంగా ప్రాణనష్టాన్నితగ్గించగలిగారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాలకు ప్రజలను తరలించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆలస్యంగా తీరాన్ని దాటిన అర్నబ్

మంగళవారం(అక్టోబర్ 27, 2026) అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున రాత్రి ఒంటి గంట సమయంలో తుపాను తీరాన్ని తాకిందని అయితే తీరాన్ని దాటేప్రక్రియ దాదాపు 8 గంటలకుపైగా పట్టిందని ఏపీ విపత్తు నిర్వహణాధికారులు బీబీసీకి వెల్లడించారు.

తొలుత తుపాను బాహ్యవలయం నర్సాపురం-అమలాపురం మధ్య తీరాన్ని తాకినప్పటికి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాకినాడకు సమీపంలో, యానానికి నైరుతి దిశలో తీరం దాటిందని అధికారులు పేర్కొన్నారు.

అర్నబ్ ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం నమోదు కాలేదని ఏపీ ఆర్టీజిఎస్ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్, అర్నబ్, కృష్ణా జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి, కాకినాడ,
ఫొటో క్యాప్షన్, కాకినాడ, ఉప్పాడ మార్గంలో సముద్రం ఉధృతి

కూలిన స్తంభాలు, నేలకొరిగిన చెట్లు..

బుధవారం ఉదయం తుపానుపై జరిగిన సమావేశంలో ఇప్పటివరకు ఎక్కడ ప్రాణ నష్టం నమోదు కాలేదని, అయితే ఆస్తి నష్టం పంట నష్టంపై అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

అర్నబ్ అతి తీవ్ర తుపాను ప్రభావంతో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 6000 కరెంటు స్తంభాలు, కాకినాడ జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వందల స్తంభాలు కూలిపోయాయని విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రితో జరిగిన సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతా విద్యుత్ లైన్లు, కండక్టర్లు పూర్తిగా తెగిపోయాయి. దీనివల్ల కోస్తా ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో, పట్టణాల్లో భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్, అర్నబ్, కృష్ణా జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి, కాకినాడ,
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా సాగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులు

తెలంగాణ సాయం కోరిన విద్యుత్ మంత్రి

అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 24 గంటల్లో పునరుద్దరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

దీని కోసం అదనపు సిబ్బందిని, సామగ్రిని పంపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు కూడా వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని, అవసరమైన అదనపు సిబ్బందిని, సామగ్రి పంపిస్తామని పేర్కొన్నట్టుకు తెలిపారు.

ముందస్తు చర్యల్లో భాగంగా వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలను తుపాను ప్రభావిత ప్రాంతాలకు పంపించామని మంత్రి వివరించారు. వర్షాలు తగ్గుముఖంపట్టిన గంటల వ్యవధిలోనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, అర్నబ్, కృష్ణా జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి, కాకినాడ,
ఫొటో క్యాప్షన్, తుపాను ధాటికి నీట మునిగిన పంటలు

తీవ్రంగా దెబ్బతిన్న పంటలు..

కోస్తా జిల్లాల్లోని ప్రధాన పంటలైన వరి, కోనసీమ కొబ్బరి, గోదావరి లంకల్లో అరటి, ఆక్వా సాగుపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది.

భారీ వర్షాలు, తీవ్ర గాలులు, వరద ముంపుతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఇప్పటికే వర్షపాత లోటు కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఈ తుపాను పెను సంక్షోభంలోకి నెట్టిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల్లో కోతకు సిద్ధమైన వరి పంటలు నెలకొరిగాయని రైతులు చెబుతున్నారు.

ఈ ఖరీఫ్‌లో రాష్ట్రం మొత్తం వరి 37.53 లక్షల ఎకరాల్లో సాగు అయితే 26 లక్షల ఎకరాలు తుపాన్ ప్రభావిత ప్రాంతంలోనే సాగు జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి జిల్లాల్లో 6.85లక్షల ఎకరాలు, ఏలూరు,అల్లూరి సీతారామరాజు, మన్యం, కృష్ణా జిల్లాల్లో 8.54 లక్షల ఎకరాల్లో వరి సాగు దశలో ఉండగా ఈ తుపాను ప్రభావం చూపిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కోనసీమ జిల్లాలో ప్రధాన సాగుగా ఉన్న కొబ్బరి పంటకి కూడా తీవ్రంగా దెబ్బతగిలింది.

గోదావరి లంక గ్రామాల్లో అరటికి తీవ్రంగా నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

కోస్తా జిల్లాల్లోనే 5.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతోంది. రొయ్యల సాగుకు విద్యుత్ ప్రధానం. తుపాన్ కారణంగా విద్యుత్ సరఫరా లేక రొయ్యల సాగు రైతులు నష్టపోతున్నారు.

కొబ్బరి తోటలు, అరటి, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలకు గాలులు వల్ల చాలా నష్టం జరిగిందని చెబుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖాధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్, అర్నబ్, కృష్ణా జిల్లా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి, కాకినాడ,
ఫొటో క్యాప్షన్, అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖ

చంద్రబాబు లేఖ

అర్నబ్ తుపానుతో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని, నష్టంపై అంచనాల కోసం కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తుపాను సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నియమించినట్టు ఆ లేఖలో వెల్లడించారు

ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని చంద్రబాబు తెలియజేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కిపైగా చెట్లు కూలిపోయాయని సీఎం వివరించారు. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని లేఖలో వెల్లడించారు.

కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని స్పష్టం స్పష్టం చేశారు. తుపాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని,తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)